Sunday, January 9, 2011

సింగరేణికి 121 సంవత్సరాలు


సింగరేణికి 121 సంవత్సరాలు
(తెలంగాణ శ్రీనివాస్‌) సిరిగల్ల నేల సింగరేణి. వెలుగులు నింపే బంగారు గని. . 121 సంవత్సరాల క్రితం గుండెలనిండా గనుల సిరులతో సింగరేణి ఉద్భవించింది. 121 సంవత్సరాలుగా నల్లబంగారం బయటపడుతూనే ఉంది. బోగ్గూట పేరు నిజం చేస్తూ బొగ్గు ఊట ఊరుతూనే ఉంది. సింగరేణి సిరుల ప్రస్థానంపై పోరు తెలంగాణ రిపోర్ట్‌ 1870 వ సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని అడవి ప్రాంతంలో విలియం కింగ్‌ గుర్రంపై తన అనుచరులతో వెళ్తున్నడు. సింగరేణి ఊరు పొలిమేరల్లోకి వచ్చిన్రు. పొయ్యిలో కట్టెలు లేకుండా ఓ ఇంట్లో వంట చేయడాన్ని చూసిన కింగ్‌ షాకయ్యిండు. ఆమెను కట్టెలు లేకుండా మంటెలా మండుతుందని అడిగిండు ఆ ఇంగ్లీష్‌ దొర. అందుకామే..” ఇది తెలంగాణ గడ్డ దొర. ఇక్కడ భూమే మండుతుంది. ఎన్నో ఏళ్లసంది మా పొయ్యిలళ్ల కట్టలే పెట్టం దొర’’ అంది. అలా ఈ ప్రాంతంలో బొగ్గుగనులున్నయని విలియం కింగ్‌ తెలుసుకున్నడు సింగరేణి దేశంలో మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థ. మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తితో దేశానికి వెలుగు నిస్తూ కొవ్వత్తిలా కరిగిపోతున్న మహాగని. 1871 సంవత్సరంలో అప్పటి భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్‌ విలియంకింగ్‌ సర్వే చేసి ప్రాణహిత , గోదావరి పరివాహక ప్రాంతాలైన ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, తూర్పు జిల్లాలలో 350 కిలోమీటర్ల పొడవునా , 600 మీటర్ల లోతున 9 వేల మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన్రు. 1886లో ఈ నిక్షేపాలను వెలికితీసే పనిని హైదరాబాద్ దక్కన్‌ కంపెనీ తీసుకుంది. 1889లో సంస్థ మొదటిసారిగా ఖమ్మం జిల్లా ఇల్లందులో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన్రు. 2005 నాటికి ఆదిలాబాదు , కరీంనగర్‌జిల్లాలకు విస్తరించింది. ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ లాభాల బాటలో పయనిస్తూ, బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్‌ ఉత్పత్తికి కేంద్రంగా దేశ ప్రగతిలోను, ఇటు పారిశ్రామిక అభివృద్ధిలో తనకు తానే సాటిగా నిలిచింది. ప్రాణానికే ప్రమాదమైనా.. సింగరేణి కార్మికులు ఎన్నడూ భయపడలేదు. సాటి కార్మికులు కళ్లముందే రాళ్లకింద చితికి పోయిన వెనకడుగు వేయలేదు. కానీ వలస పాలకులు బతుకు ఛిద్రం చేస్తుంటే మాత్రం చేష్టలుడిగి పోయిన్రు. బొగ్గు గనుల్లో వేసిన ట్రాకులు కార్మికుల గుండెల్నీ చీల్చినయి. బతుకుల్ని తొక్కుకుంటూ ప్రొక్లైనర్లు గునుల్లోకి చోచ్చుకొచ్చినయి. భూ అతఃకుహరం.చూట్టూ కటిక చీకటి. గుండె దడ పుట్టించే డ్రిల్లర్ల చప్పుడు. ఎప్పుడు ఎటువైపు నుంచి రూఫ్‌ కూలీ మీద పడతుందో తెలియదు. లోపలికి పోయే ప్రతీసారి బయటికి వస్తమో రామో తెలియదు. ఆ చీకటి గుహల్లో పొంగే పాతాళ గంగ ఎప్పుడు మింగేద్దామా అని చూస్తది. ఇనుప చువ్వలు అడ్డంగా శరీరంలోకి దూసుకుపోతయి. అక్కడ జరిగేది నిజమైన వైకుంఠపాళి. పాములుంటయి కాని నిచ్చెన్లుండవు. జీవితం ఆరిపోవటమే కాని వెలుగుండదు. అయినా వారి పయనం ఆగదు. ఎర్రటి రక్తంతో ప్రతి బొగ్గు తునకకు స్టాంపేసి పంపుతరు. నిత్యం చీకటి మృత్యువుతో పోరాడుతూ, బయటి ప్రపంచానికి వెలుగులనిస్తరు. సింగరేణిని రక్తం ధార పోసి పెంచింది కార్మికులే. ఎంతో మంది కార్మికుల ప్రాణాలే పునాధిరాళ్లుగా ఎదిగింది. మొదట్లో సింగరేణిలో కార్మికులను నిర్బంధంగా పనిచేయించేవారు. అప్పటి రోజుల్లో కిరోసిన్‌ లాంతరు, గునపాలు, చెక్కడబ్బాలు, ఎలాంటి రక్షణ సౌకర్యాలుండేవి కావు. అణా, బేడా చెల్లిస్తూ స్త్రీలు పిల్లలతో బలంవంతంగా పని చేయించేవారు. అలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా కార్మికోద్యమాలు లేచినయి. 1938లో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆవిర్భవించింది. ఎందరో నాయకులు ప్రాణత్యాగం చేసి ఓ మాదిరి జీతాలతో కూడిన ఒప్పందాలను సాధించిన్రు. 1960లో మొదలై 1970వ సంవత్సరం వరకు జాతీయ స్థాయిలో వేతన ఒప్పందం అమల్లోకి రావడం, కార్మికులకు మెరుగైన జీతభత్యాలు రావడం కార్మికుల జీవనశైలిలో మార్పుకు నాంది అయ్యింది. 1889లో 59 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సంస్థ ప్రస్తుతం 36 అండర్‌గ్రౌండ్‌ బావులు, 14 ఓపెన్‌కాస్ట్ లతో 50 మిలియన్‌ టన్నుల బోగ్గును ఉత్పత్తి చేస్తున్నది. 1991లో సంస్కరణల పేరుతో కార్మికుల కుదింపు, శ్రమ దోపిడి, పోరాడి సాధించుకున్న హక్కులను, వలస పాలకులు ధ్వంస చేసిన్రు. స్వార్థ ప్రయోజనాలకోసం, కంట్రాక్టర్ల భోజ్యంగా తయారైంది .1991లో, 1,16,000 మంది కార్మికులుండగా 18 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. ప్రస్తుతం 67 వేల మంది కార్మికులకు కుదించి 50 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. సింగరేణిలో చీకటి కోణాలెన్నో ఉన్నయి. వలస పాలకుల వివక్ష పాలనకు తెలంగాణ సిరుల తల్లి తల్లడిల్లిపోతుంది. కార్మికులు సమస్యల గుహల్లో జీవిత పోరాటం చేస్తున్నరు. ఇప్పటికీ.. కార్మికవాడలు, నిర్వాసిత గ్రామాలు, ఉపాధిలేమి ఛాయలు ఆకలి ఆర్థనాదాలు, నిరుద్యోగం, ఆకలి చావులు సిరుల సింగరేణిలో తాండవిస్తున్నయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించి తన అక్కున చేర్చుకున్న అన్నపూర్ణ సింగరేణి తల్లి. వలస పాలన దోపిడితో , వట్టిపోయిన బొగ్గు బావులతో ఉపాధిలేని ఉత్పత్తి వైపూ పరుగులు తీస్తున్నది. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ పేరుతో యాంత్రీకరణకు మొగ్గుచూపుతూ, పెద్ద కంపెనీలకు, బంధువులకు బొగ్గు గనులను దోచి పెడుతున్నరు. సింగరేణి సంస్థలో కోట్ల రూపాయలు కుంభకోణాలు వెలుగులోకి వచ్చినయి. కీలకమైన స్థానంలో ఉన్న డైరెక్టర్లు అందినంత దోచుకొని ఉద్యోగానికి రాజీనామా చేసి విదేశాలకు చెక్కేసిన్రు. ఓ డైరెక్టర్‌ సింగరేణి ఓపెన్కాస్టు మైన్స్లో పై మట్టిని తొలగించే ఓవర్ బర్డన్ పనుల్లో 100 కోట్ల రూపాయలు సంస్థకు నష్టం చేసి, కాంట్రాక్టర్లతో కమీషన్లకు కక్కుర్తి పడి సొమ్ము మింగేశాడని ఆరోపణలు ఉన్నయి. ఇలా అనేక స్థాయిల్లో కోట్లాది రూపాయలను వలస డైరెక్టర్లు మింగేస్తున్నరని కార్మికులు ఉద్యమాలు చేసిన్రు. ఇక రానున్న భవిష్యత్‌ కాలంలో ఇలాంటి దోపిడీలను నిలువరించక పోయినా.. తెలంగాణ సిరుల తల్లిని వలస పాలననుంచి విముక్తం చేయకపోయినా.. సింగరేణి సాక్షిగా భవిష్యత్‌ తరాలకు మిగిలేది బూడిదే. రానున్న రోజుల్లో సింగరేణి కార్మికులు వలస పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నయి. ఇక ముందు ముందు ఇలాంటి ఆవిర్భావ వేడుకలకు చుట్టు పక్క ప్రాంతాలవారు తప్ప కార్మికులు కనిపించని పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. తల్లి గుండెల్నీ చీల్చుకుని బిడ్డకు పాలిస్తే.. తెలంగాణ తల్లి హృదయాన్నీ చీల్చీ తన బిడ్డల కోసం బంగారు గనుల్నీ అందించింది. అడిగితేనే వరాలిచ్చేది దేవుడైతే.. అడగకుండానే సిరులు కురిపించే తల్లి తెలంగాణ తల్లి. ప్రపంచ బొగ్గు గనుల్లో మకుటాయమానమైన సింగరేణిని ఇచ్చి బిడ్డల్ని ఆశీర్వదించింది తెలంగాణ తల్లి. కానీ ఆ తల్లి ప్రేమ సీమాంధ్ర పాలకుల గుప్పిట్లో నలిగిపోయింది. వలస పాలకుల దోపిడిలో ఒట్టిపోయిన ఆవులా మారింది. సిరుల సింగరేణిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డపై ఉంది. త్వరలోనే స్వరాష్ట్రమేర్పడి మళ్లీ సిరుల సింగరేణి చిరునవ్వులు చిందిస్తదని కోరుకుందాం.

No comments: