నిజమే. మేం మందలాంటి వాళ్లం. సంతలాంటి వాళ్లం కూడా. నిజమే తెలంగాణే మాకు అతి పెద్ద సమస్య. జీవన్మరణ సమస్య. బలవన్మరణాలు మాట్లాడుతున్నప్పుడు. మేం పలవరిస్తుంటాం. కలవరిస్తుంటాం. మంటలంటుకున్న వాడి జై తెలంగాణ నినాదాన్ని ఆవాహన చేసుకుంటూ ఉంటాం. మనుషులం మేము. ఉత్తబోలు మనుషులం. ఒక కారణం కోసం ప్రాణాలు బలిపెట్టిన వాళ్ల మృత్యు రహస్యం తెలిసిన వాళ్లం. యాదిలో మనాదలో తెలంగాణ ను మాత్రమే నిలుపుకున్న మామూలు మనుషులం. సిరలు, ధమనుల గుండా త్యాగాలు ప్రవహించిన వాళ్ల కోసం. ఏడుస్తున్న వాళ్లం. వెక్కిళ్లుపడ్తున్న వాళ్లం. మాట మీద నిలబడి మరిచిపోని వాళ్లం. యాదయ్య గుర్తే. నేటికి రెండేళ్ల కిందట విశ్వవిద్యాలయం ఒక నెత్తుటి కల కంటున్నప్పుడు. బాష్పవాయువు గోళాల మోత తెలంగాణ నిండా వ్యాపించినప్పుడు. యాదయ్య యూనివర్సిటీ గేటు ముందర ప్రాణంతో దుంకులాడ్తూ, మంటల్లో మాడి చనిపోతున్నప్పుడు ‘జై తెలంగాణ’ అన్న నినాదం బహుశా ఆ మంటలు మా ఆత్మలను అంటుకొని ఉన్న వి. అవి ఆరేవి కావు. ఆ నినాదాలు మా మనసును ఎప్పుడో ముట్టుకున్నవి. అవి చెదిరేవి కావు. అవును మాకు ఇప్పటి సమస్య తెలంగాణ మాత్రమే.
వేణుగోపాల్‌డ్డి శవం ముందర నిలబడి ఉన్నరు అప్పుడు మీరు. మీసాలులేని శ్రీధర్‌బాబు కావొచ్చు. మీసాలు తిప్పిన దామోదర్‌డ్డి కావొచ్చు. కొన్ని కన్నీళ్లు కూడా కార్చారు. ఆ కన్నీటికి ఇప్పుడేమి ఆపాదించగలం. కల్మషంలేని కన్నీటి కోసం కదా! మా దేవులాట. ఇప్పుడు మీరు సోకులు పోతున్న అసెంబ్లీ సీట్లలో కూరుకుపోయారు. అసెంబ్లీ మారిపోయింది. దానికిప్పుడు ఏ ఉద్రిక్తతా లేదు. అసెంబ్లీ గేటిప్పుడు ప్రశాంతంగా ఉండవచ్చుగాక. కానీ ముట్టడిస్తామని చెప్పి గేటెక్కి దుమికిన వీర విద్యార్థులు ఇప్పుడింకా పచ్చి జ్ఞాపకమే. మీరు మాత్రం అసెంబ్లీ మెత్తటి పంచరంగు సీట్లలో కూరుకుపోయారు. వేణుగోపాల్‌డ్డికి హామీ పడిన మీరు అబద్ధాలలో కూరుకుపోయారు.
చనిపోయిన వాళ్ల ఆత్మలను అమ్ముకునే ఒక జాతి అమరవీరుల స్థూపం వద్ద, అసెంబ్లీ లోపలా ఒక్కటి గా తిరగడమే ఇప్పటి విషాదం. మీసాలు తీసేసిన బంట్లు, తెలంగాణ సోయి తప్పి అసెంబ్లీసుఖాల్లో సొమ్మసిల్లడమే ఇప్పటి విషాదం.
అవును మాకు తెలంగాణ తీర్మానం మాత్రమే కావాలి. మరో సమస్య మాకేదీ లేదు. మద్య నిషేధం ఎత్తివేసి, బెల్టుషాపులు బార్లాతెరిచిన వాడే మద్యం కుంభకోణం గురించి మాట్లాడుతూ ఉండవచ్చు. సీసాలో భూతాలను సృష్టించే భూతవైద్యులు మీరు. నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి కోరుకునేది, నారా చంద్రబాబునాయు డు అడిగేది ఒకటే అవడమూ యాధృచ్ఛికం కాదు. వంతపాడేవాడు ఎవడైనా కావొచ్చు. సంతలాగానే ఉంటుంది తెలంగాణ. నిఖార్సయిన సత్యంలాగా.. గుట్టే మీ లేకుండా బహిరంగంగా.. తేటతెల్లంగ చీకట్లో షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకోవడం కాదిది. తెలంగాణ బహిరంగంగానే జట్టుకట్టి అడుగుతున్నది. ఇది గుర్రం.. ఇది మైదానం. రెండేళ్లుగా శాంతిగానూ, ప్రజాస్వామ్యంతోనూ పోరాడాం. ప్రజాస్వామ్యాన్ని నమ్మినం. పార్లమెంటునూ నమ్మినం. చనిపోయిన పిల్లల శవాల ముంద ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ప్రతిజ్ఞలను, పూనిన ఆనలనూ నమ్మి నం.
కనుక అడుగుతున్నం. మద్యము, గద్యము, కరువు, కాటకం, నీరు, నిప్పు, ఉద్యోగం, చివరికి మీ కవిలికట్టెల అంకెల బిందెల గారడీచేసే బడ్జెట్‌కన్నా మా ప్రాణ సమానమైంది తెలంగాణ. అంతకుమించి తెలంగాణకు మరే సమస్యా లేదు. రెండేళ్లే పోరాడలేదు. ఆరు దశాబ్దాలుగా కొట్లాడ్తున్నం. ఇస్తనన్నవాడు ఇవ్వ లే. తెస్తనన్న వాడు తేలేదు. మేం మోసంపోయినమా? ఎనిమిది వందల బలిదానాల తర్వాత రెండేళ్ల విరామంలేని పోరాటాల తర్వాత అలసిపోయినమా? లేదు తెలంగాణ అలసిపోదు. అడుగుతున్నం. ఈ పరి అసెంబ్లీ. యుద్ధ వేదిక. రంగస్థలం వీధుల నుంచి అసెంబ్లీకి మారింది. ఇస్తనన్నవాడు, తెస్తనన్నవాడు, వ్యతిరేకం కానివాడు, ప్రేమ ఉన్నవాడు, నటిస్తున్నవాడు, ఆత్మ ఉన్నవాడు, ఆత్మలోకంలో దివాళా తీసినవాడు. వాడెవడైనా కావొచ్చు. మరుగు మాటలు వద్దు. కప ట నాటకాలు వద్దు. బలవంతపు కన్నీళ్లూ వద్దు. బస్.. తెలంగాణ తీర్మానం చేయండి. ఎవటో తేలనివ్వండి.
తెలంగాణ శవాల మీద పేలాలు ఏరుకునే జాతి ఒకటి సిగ్గులేని జాతి ఒకటి ఇదే తెలంగాణలో తయారై ఉన్నది. అది బానిస జాతి.
అది తెలంగాణను అమ్ముకుని అసెంబ్లీ సీట్లలో కూరుకుపోయింది. కూచోరాదు. లేవరాదు. సుఖూన్. ఇక పీడ కలలు లేవు. పదవుల వేట. చీఫ్ విప్ ప్రవచిస్తున్నడు. డబ్బాలో రాళ్లు దొర్లుతున్నయి. ‘భళేగుందిరా మన అసెంబ్లీ’ అటోడు ఇటు కూసుండు. ఇటోడు అటు కూసుండు. వీసమెత్తు విలువలేని మనుషులు. మేనేజ్ చేశారు మీరు. రహస్యం గా, కుట్రగా.. ముందు మీడియాను. మీడియా మాకు ఎజెండాలిస్తున్నది. మద్యంపై పోరాడమని చెబుతున్నది. జగన్ అవినీతి భూతం కబళిస్తున్నదంటున్నది. చంద్రబాబు కేసు గెలిచి, తెరిచిన పుస్తకమైండని అబద్ధాలాడ్తున్నది. నిజమే కావొచ్చు. చంచల్‌గూడ క్రిక్కిరిసిపోయి ఉండవచ్చు. నిందితులందరూ మా హైదరాబాద్ మీద గద్దల్లా వాలిన వాళ్లూ కావొచ్చు. కానీ. ఇవన్నీ తర్వాత. భంగపడి ఉన్నవాళ్లంమేము.
ఒక రహస్య కుట్రకు బలయిన వాళ్లం. మా రెక్కల్ల బొక్కల్ల కల్సి తిరగాలని, మా ఆకాంక్షను అసెంబ్లీలో చెప్తారని, మా గాయాలను తడుముతారని పంపించిన మా వాళ్లనూ మేనేజ్ చేశారు మీరు. మా ఓట్ల మీద ఎన్నికైన మా వాళ్లు.. మాట పడిపోయిన మందబుద్ధుపూట్టా అయిండ్రో. తెలిసే సరికే ఎవరూ మిగలని వాళ్లుగా మేమూ మా పన్నెండు మంది ఎమ్మెల్యేలు తోడు ఐదుగురు సీపీఐ, ఇద్ద రు బీజేపీ. మీడియా రాయదు. మా వాడూ మాట్లాడడు. అసెంబ్లీ శీతలంగా ఉన్నది. ఒక్క తెలంగాణ మంట తప్ప. ఒక్క వెక్కిరించి, నిలదీసే మా తెలంగాణ మాకు గావాలె ప్లకార్డు తప్ప. మీ బతుకు సుఖూన్‌గ ఉన్నది. తెలంగాణ తీర్మానం అడిగిన పాపానికి తెలంగాణ తేల్చి మాట్లాడండి అని అడిగినందుకు, సమ్మె కట్టి నం, వీధులను ఎరుపెక్కించినం, గుట్టలు గుట్టలుగా బలిదానాల శవాలనూ పేర్చి నం. తీర్మానం చెయ్యండి ఏం చేస్తరో? అడిగినందుకు మా వాళ్లను మార్షల్స్‌తో గెంటించిన ముఖ్యమంత్రీ, మంత్రులారా, ప్రతిపక్ష నేతలారా! తెలంగాణ కాంగ్రె స్, తెలుగుదేశం ఎమ్మెల్యేలారా! ఏమనుకోవాలి ఈ సభను. బడ్జెట్‌లు చాలా ప్రవేశపెట్టారు.
ఈ బడ్జెట్ వికృత తోకల క్రింద, అవి సమీకృతమైన అధికారగణం పదఘట్టనల క్రింద, అది రూపొందించిన రాజ్యాంగ యంత్రం క్రింద, వీటన్నిటికీ ఎజెండాలు సెట్ చేసి తారుమారు విలువలను, తారుమారు సమస్యలను ఎజెండాగా చేసే మీడియా ముంగర మేము భంగపడ్డం. మేము కనిపెట్టగలం. వాస్తవాన్ని. అవును మాకు తెలంగాణ మాత్రమే కావాలె. మీకు తెలంగాణ తప్ప సవాలక్ష సమస్యలు కావాలి. యుద్ధరంగం ప్రస్ఫుటంగా, తేటతెల్లంగా, ప్రకాశం గా, ఉన్నదున్నట్టుగా కనబడ్తూనే ఉన్నది. మా బానిసలు, కనికట్టుకు మూర్ఛనలుపోయిన మా కాంగ్రెస్, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఒక్కమాటా మాట్లాడని స్థితిలో ఎవరు తెలంగాణ కోసం నిలబడినవారు. ఎవరు తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడినవారు. తేల్చుకోవడం సులభమైంది కదా! ఎవరి సభ ఇది.
క్రిక్కిరిసిపోయిన సభలో మూర్ఛిల్లి చదువుతున్న బడ్జెట్ ప్రసంగాల్లో ఎవరి గొంతు నొక్కారు. ఏ తీర్మానం గొంతు నొక్కి, కేకలుపెట్టిన ఏ ఏమ్మెల్యేలను బయటకు పంపించారో వారే మావారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను జెండామీద నిలిపినవాడే తెలంగాణ వాడు. మీరెన్నైనా మాట్లాడండి. అనేక పరీక్షలు. అమరవీరుల శవాలమీద ప్రతినబూనినవాడి కాఠిన్యం ఇవ్వాళ్ల తెలంగాణకు అవగతమైంది.
ప్రజాస్వామ్య దేశంలో భంగపడ్డవాళ్లం మేము. వీధుల్లోంచే మాట్లాడుతున్నం. మీ అసెంబ్లీ గేట్లెక్కిన వాళ్లం మాట్లాడ్తున్నం. యూనిర్సిటీలను భగ్గున మండించి న వాళ్లం మాట్లాడ్తున్నం. మీకు ఓట్లేసి పంపించిన వాళ్లం మాట్లాడ్తున్నం. మీ అసెంబ్లీ ఒరుగుడు కుర్సీల మీదకు మిమ్మల్ని పంపిన వాళ్లం మాట్లాడ్తున్నం. మాకు వేరే సమస్య వద్దేవద్దు. ఒకే ఒక సమస్య.
ఎవరు తెలంగాణ తీర్మానానికి పట్టుబట్టి అసెంబ్లీని దద్దరిల్ల జేస్తడో వాడే ఇప్పటి పచ్చి పక్కా తెలంగాణవాది. మరుగు మాటలు, ఆటుమాటలు, పోటీ మాటలు, కడుపు నిండిన బేరాలు, తెంగాణ పెదాలమీద మాట ఇంకెంత మాత్రం కాదు. అది కడుపులో గడ్డకట్టి, సుమ్మర్లు చుట్టుకున్న ఎనిమిదివందల మందిని పోగొట్టుకున్న తల్లుల గర్భశోకం. ఆ శోకం నుంచి ఆ దుఃఖంనుంచి, ఆ వారసత్వాల నుంచి మాట్లాడ్తున్నం. బాతాఖానీ క్లబ్బులుగా పేరుపడిన మీ చట్టసభల్లో అంకెలు, గారడీలు, ప్రవహించని ప్రాజెక్టుల ప్రణాళికలు, ప్రవహిస్తున్న సారా కంపు, గవులు కొడ్తున్న అవినీతి గబ్బు.. అవన్నీ మీరే ఏలుకోండి. మాకు ఇదే అసెంబ్లీలో రెండేళ్ల కిందట తీర్మానానికి మేం వ్యతిరేకం కాదని గప్పాలు కొట్టిన వాళ్ల సమాధానం కావాలి.
మోసం చేసి, అబద్ధాలాడి, ఇప్పుడు మా పన్నెండు మందినీ బయటకు తరిమి సుఖంగానూ, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంలోనూ, కాపట్యంలోనూ మీరు మా నాలుగున్నర కోట్ల మందిని ఏలడం ఇంకానా ఇంక అసాధ్యం. మాట్లాడ్తరా ఒకే మాట తెలంగాణ తీర్మానం. లేదా నోరు మూసుకోండి. దయచేసి ఇక మా ఓట్ల కోసం రాకండి. దయచేసి మా గురించి మాట్లాడకండి.
రెండేళ్ల మా ఆరాటాన్ని, పోరాటాన్ని, దుఃఖాన్ని ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, మీ రంగులద్దిన మాటల్లో ఎట్లా మోసం చేశారో తెలుసుకున్నం కనుక.. మరోసారి మరోసారి ఇది గుర్రం.. ఇది మైదానం. మా శత్రువులకూ, మా ఓట్లతో వెళ్లి మమ్మల్నే మోసం చేస్తున్న మా వాళ్లే అయిన మా బానిసలకు ఒక విన్నపం. మీరిప్పుడు మీమీ అద్దాల సౌధాల్లో స్వప్నాలు కంటున్నరు. అవి భళ్లున పగిలే రోజొకటి ఎదు
రుచూస్తున్నది. అసెంబ్లీ పన్నెండు మందితో పట్టనప్పుడు, మార్షల్స్ తోసేయలేనంత బలగంతో నిండే రోజొకటి పొంచి ఉన్నది. తెలంగాణ తీర్మానంపై తేల్చుకోని వారికి, మాట్లాడని వారికి, శాశ్వత సమాధులు తయారవుతున్నవి. చిలుకలగుట్టకు జనం ఎదుక్కుతున్నరు. జనవనంలో తెలంగాణ గుండెల నిండా పొంగిననాడు మీ కలలు కల్లలై ఆరు స్థానాల రంగస్థలం ఉప్పొం గే దినం ఒకటి రాబోతున్నది. అవును నిజమే. తెలంగాణ మరొక కాల పరీక్షలో కదంతొక్కడానికి సన్నద్ధమవుతున్నది. అన్ని రకాల ద్రోహులకు సమాధి. తెలంగాణ శక్తులకు పునాది. నమస్తే తెలంగాణ.