Sunday, March 18, 2012


వైరుధ్యాల మంటల్లో ఉద్యమం


పోరాడేశక్తులు తమ పోరు పంథాల్లో ఇంకోదారిలో ముందుకు తీసుకపోవాలి. ప్రజలు పోరుదారిలో దుముకుతారో, లేదా పార్లమెంట్‌లో బిల్లును అమలుజరపడానికి ఒత్తిడి రూపంలో ఉప్పొంగుతారో ప్రజలే తేల్చి చెబుతారు. అందువల్ల సుదీర్ఘమైన తెలంగాణ రాష్ట్రసాధన పోరాటంలో వైరుధ్యాలను అధిగమిస్తూ తెలంగాణ ఎలా తనకుతాను ముందుకు సాగాలో సమర్థవంతంగా వ్యూహరచన చేసుకుంటుంది.
ఉద్యమకారులకు తోటి ఉద్యమకారుల పట్ల ఉండాల్సిన మిత్ర వైరుధ్యాలు కాస్తా శత్రు వైరుధ్యాలుగా మారిపోతే ప్రమాదమే మరి. ఈ పరిణామం ఏ దశదాకా పోయాయంటే ఉద్యమకారుల మధ్య వైరుధ్యాలను చూసి శత్రువు మహదానందపడేదాకా వెళ్ళింది. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేస్తున్న శక్తులపై ఉండాల్సిన కసి, ద్వేషం, ఆవేశాన్నంతా తోటి ఉద్యమకారులపై వెళ్లగక్కటం బాధాకరమైనది.
ఇలాంటి సందర్భాల్లో శత్రవు స్వేచ్ఛగా గాలి పీల్చుకొంటాడు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న శక్తుల మధ్య విభిన్నాభిప్రాయాలను చల్లార్చలేని మంటలుగా మారుస్తారు. ఈ మంటల్ని ఆర్పాల్సిన మేధావులు, చల్లార్చాల్సిన వ్యక్తులు, పెద్దల పాత్ర ఈ సందర్భంలో ఎంతో కీలకమైనది. కాని వీళ్లు కూడా ఎవరో ఒక వకాల్తా పుచ్చుకుంటే ఎట్లా ఉంటుందో దాని పరిణామాలు ఎంత నష్టం చేసే విధంగా ఉంటాయో చెప్పలేం.
అట్లాగని భిన్నాభిప్రాయాలను చర్చకు తేవొద్దని కానీ, నడుస్తున్న ఉద్యమంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపవద్దని కానీ, ఒంటెద్దు పోకడల నాయకత్వాన్ని మందలించవద్దని కానీ ఎవరూ అనటం లేదు. దీన్నే ఆసరా చేసుకొని ఒక నాయకుణ్ణి తిట్టడం కోసం తమ జ్ఞానాన్నంతా ప్రదర్శించటం ఎంతవరకు సమంజసం?
ఇలా ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు పరిధులు దాటి పోవటం జరిగితే అది నడుస్తున్న ఉద్యమానికి ఎంత నష్టమో అంచనా వేయలేము. చివరికి ఇవి బాగా ముదిరిపోయి ఒక దశకు వచ్చాక ఒక ఉద్యమ నాయకునిపై మరొక వర్గం దాడులు చేయించుకునే దశకు కూడా దిగజార వచ్చును. అది ఉద్యమానికి మరింత నష్టం చేసే దశకు వెళ్తుంది. దీనివల్ల కోట్లాది ప్రజల ఆకాంక్షలకు దర్పణంగా నిలబడాల్సిన ఉద్యమ శక్తులు చీలికలు పేలికలైతే ఉద్యమం గందరగోళంలో పడ్తుంది.
శత్రువు ఏ ఉద్యమాన్నైతే తాను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారో అదే పనిని ఉద్యమ శక్తుల మధ్య విభేదాలే చేయగలిగితే శత్రువుకు అంతకంటే కావల్సిందేముంది? అదే కాకుండా ఉద్యమ పోరు శక్తుల మధ్య కూడా శత్రువో లేదా దీన్ని అణచాలనే ప్రభుత్వమో ఒకరి పక్షం వహించి ఈ వైరుధ్యాలను ఘర్షణలుగా మార్చే స్థితి కూడా లేకపోలేదు. పాలకులు తమ అస్తిత్వం కోసం ఎక్కడ సందు దొరికితే అక్కడ జొరబడి ఉద్యమాన్ని అడ్డుకునేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారనడంలో ఎటువంటి అనుమానం లేదు. కుల మతాలకు అతీతంగా ప్రజలు ఉద్యమంలో సంపూర్ణంగా భాగస్వాములౌతున్నప్పుడు కులం ప్రశ్న ఉండదు. మతం ప్రశ్న తలెత్తదు. అట్లని కులం లేదని కాదు.
అయినా నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తులో, లేదా ఆ నాయకుని చుట్టూ చేరిన ఎవరో కొందరు కుల ముద్రలతో వ్యవహరించవచ్చును. ఆ నాయకుని చెవిలో జోరీగల్లా చేరి కులాధిపత్యం పనులు కూడా చేయవచ్చును. దాన్నెవరూ కాదనలేనిది. అలాంటి సందర్భాలు ఉద్యమంలో అనుకోకుండా ఎదురుకావచ్చును. దీన్నే అడ్డుపెట్టుకుని కులముద్రల ఆధారంగా, నాయకత్వ స్థానంలో ఉన్నవారి కులం ప్రాతిపదికగా చేసే విమర్శలు మొత్తం ఉద్యమానికే నష్టం చేసే దశ ఉంటుంది.
లేదు నిజంగానే అగ్రవర్ణ దురహంకారంతో ఓ దళిత నాయకుడిపై దాడిచేసే యత్నాలు ఎవరైనా చేస్తే బహుజన నాయకత్వాన్ని తక్కువగా చూస్తే దాన్ని నిర్ద్వందంగా ఖండించి అలాంటివి పునరావృతం కాకుండా చూసే బాధ్యత కూడా విస్తృత ఉద్యమానికి నేతృత్వం వహించే నేత లేదా నేతలు చేయాలి. సరిగ్గా ఇక్కడే మౌనంగా ఉంటే శత్రువు ఏ రూపాన్నో ఎవరి పక్షమో జొరబడి గందరగోళపరుస్తాడు.
అందుకు అవకాశం ఉద్యమనేతల మధ్య భిన్నాభిప్రాయాలేనని చెప్పాల్సిన పనిలేదు. ఇలా… ఒక్కటికాదు కొన్ని వందల సందర్భాల్లో ఉద్యమంలో జరిగే చిన్నచిన్న పొరపాట్లు, దాన్ని దిద్దుకోకుండా నాయకత్వం అహంకార పూరితంగా ప్రవర్తించే సందర్భాలు మొత్తం అసలు ఉద్యమానికే నష్టం తెస్తాయి. ఈ సందర్భం సరిగ్గా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఉద్యమశక్తుల మధ్య ఉన్న వైరుధ్యాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.
ఎవరికి వాళ్లు కూటములుగా మారుతున్నారు. మేధావులు తమ కలాలతో విస్తృతంగా చర్చలు చేస్తున్నారు. కానీ ఉద్యమం కోసం తపన చెందుతున్న మేధావులు కూడా ఉద్యమ శక్తుల మధ్య ఉన్న అంతరాలను తగ్గించగలిగారా? ఈ అంతరాలను మరింత పెంచి పోషిస్తున్నారా? అన్నది కూడా సునిశితంగా పరిశీలించాలి. చివరకు ప్రజలు తమ ఆకాంక్షలను తమ గుండెల్లో దాచుకుని గుండె చెరువయ్యేలా దుఃఖిస్తున్నారు. కాకపోతే తమను తాము పగులగొట్టుకొని ఆత్మ త్యాగానికి సిద్ధపడుతున్నారు. శైవులు తమ దేహాల్ని నరుక్కొని తమ భక్తిని చాటుకున్నట్లు తెలంగాణలో ఇప్పటికి 700 మందికి పైగా తమ ప్రాణాల్ని తెలంగాణ తల్లికి అర్పించి ఈ నేల బిడ్డలుగా తమ రుణం తీర్చుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇప్పుడు అడ్డుపడుతుంది కేంద్రమా? సీమాంధ్ర పాలకులా? వీటన్నిటికంటే ముందుగా ఉద్యమశక్తుల మధ్య అనైక్యతా అన్నది చూడవల్సి ఉంది. నాలుగున్నర కోట్లమంది ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు నిప్పులగుండాలను దాటుకుంటూ వచ్చి తమ నిబద్ధతను చాటుతూనే ఉన్నారు. ఉద్యమశక్తులపట్ల, కొందరు నేతలకున్న భిన్నాభిప్రాయల మూలంగా ఇంత పెద్ద విస్తృత ఉద్యమం ఇట్లా కునారిల్లుతూ నడవవలసిందేనా? ఎవరో కొందరు వ్యక్తుల ఐడెంటిటీ కోసం మొత్తం ఉద్యమం ఇట్లా నడువవలసిందేనా? ఉద్యమశక్తుల ఏకీకరణ చేయటమే ఈనాడు అందరి ముందున్న కర్తవ్యం.
ఈ ప్రశ్న రాగానే అసలు ఉద్యమం నడిపిస్తున్న వారే ఉద్యమ శ్రేణులు కాదని తామే ఉద్యమ శక్తులమని వాదన తెస్తారు. గద్దిస్తారు. ఎదుటివాళ్ల నోళ్లు మూపిస్తారు. ఈ రకం వర్గం వాళ్లు గత 10 ఏళ్ల నుంచి ఒక చర్చను లేవదీస్తూనే ఉన్నారు. ఉద్యమ శ్రేణులే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య కీలకదశల్లో నిర్ణయాత్మక దశల్లో ఉద్యమశక్తులు లేకపోవటం వల్లనే ఉద్యమానికి ఈ దుర్దశ వచ్చిందని, అందువల్ల ఉద్యమశక్తులే నాయకత్వం వహించాలనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో రాజకీయ పార్టీగా ఇది మామార్గం. ఇవి మా ఎత్తుగడలు, ఈ దారిలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకుందామని స్పష్టంగా సంబంధిత రాజకీయ పార్టీ చెబుతుంది.
గత 10 ఏళ్ళుగా ఆ పార్టీ పని చేస్తూ పోతుంది. ఈ విధానంతో ఎవరికీ పేచీ ఉండాల్సిన అవసరం లేదు. అది ఆ పార్టీ విధానం, పోరాటం చేసే వ్యక్తులు వీరి దారి వేరే. ఈ ఉద్యమానికి ఆ మూడక్షరాలేనని, ఆ కెసిఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు!! పోరాటశక్తులు నడిపిస్తున్నాయి!! పోరుపాట నడిపిస్తుంది!! త్యాగాలదారిలో ఈ ఉద్యమం నడుస్తుంది. నిరంతర ఉద్యమాలతో ముందుకు సాగుతుంది. ఉద్యోగులు లేకపోతే ఈ ఉద్యమమేలేదు. విద్యార్థులు లేకపోతే ఈ ఉద్యమం ఇక్కడి దాకా వచ్చేదికాదు.
డిసెంబర్ 9 ప్రకటనకు ముందూ వెనుకా ఎవరు?…. ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు, సమాధానాలు, వాదాలు, వివాదాలు, భౌగోళిక తెలంగాణలు, సామాజిక తెలంగాణలు, ప్రజాస్వామిక తెలంగాణలు, ఇలా ఎన్నెన్నో ఉద్యమదారుల్లో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతూ నడుస్తుంది. ఏ ఉద్యమం లోనైనా గాంధేయ మార్గంలో ముందుకు సాగే శక్తులు ఉప్పు సత్యాగ్రహాలు, సకల జనుల సమ్మెలు ఉంటాయి. ఏ స్వాతంత్య్ర ఉద్యమంలోనైనా భగత్‌సింగ్‌లూ, చంద్రశేఖర అజాద్‌లు, బోస్‌లు, తెలంగాణ ఎర్రసెలకల నుంచి తొలుచుకొచ్చిన మల్లోజులూ ఉంటారు. ఎవరిదారి వారిది. అంతిమంగా ప్రజలకు విముక్తి కలిగించటమే కావాలి.
తెలంగాణ రాష్ట్రసాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఏ స్వాతంత్య్ర పోరాటంలోనైనా ప్రజల మధ్య వైరుధ్యాలు, ఉద్యమశక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే భిన్నాభిప్రాయాలే తెలంగాణ ఉద్యమంలో తీవ్రాతితీవ్రం కావటం చిత్రం. దాన్ని మరింత మంట చేసి చూపటం విచిత్రం. ఉద్యమంలో రకరకాలుగా ఉంటారన్నది అందరికీ తెలియందికాదు. కెసిఆర్, గద్దరూ ఇద్దరూ ఏదో ఒక సభలో కౌగలించుకుంటే తెలంగాణ సంతోషపడుతుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ, మన చుక్కా రామయ్య తెలంగాణ గురించి మాట్లాడితే ఈ నేలంతా పులకరిస్తది.
తెలంగాణ ఉద్యమశక్తులే, ఈ మట్టినుంచి వచ్చిన ఉద్యమనేతలే సంఘర్షించుకుటుంటే ఈ నేల తట్టుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో వైరుధ్యాలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి. లేకపోతే సకల జనుల సమ్మెలాంటి మహోన్నత ఉద్యమం జరిగిన తదుపరి కూడా గుప్పెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆనందంగా ఉండటానికి కారణం తెలంగాణ ఉద్యమశక్తుల పట్ల ఉన్న వైరుధ్యాలే.
ఈ ఉద్యమశక్తుల మధ్య వైరుధ్యాలు శత్రువులకు వరాలుగా మారకూడదు. ఈ వైరుధ్యాలు తెలంగాణ ఉద్యమం మరింత పదునెక్కటానికి దోహదపడాలి. ఒకర్ని ఒకరు తిట్టుకునే తిట్ల పురాణం తగ్గాలి. తెలంగాణ ఉద్యమశక్తుల మధ్య వైరుధ్యాలే కాకుండా, తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టిడిపి నేతలు కూడా తమ శైలిని మార్చుకోవాలి.
తెలంగాణ కాంగ్రెస్, టిడిపి నాయకులు చేస్తున్న గందరగోళం ఇంతా అంతాకాదు. ఢిల్లీలో 10జనపథ్‌కు, బంజారాహిల్స్‌లోని టిడిపి కార్యాలయాల దగ్గర బిక్కుబిక్కుమంటున్న దుస్థితి నుంచి ఈ రెండు పార్టీల తెలంగాణ నేతలు బైటపడాలి. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీల ప్రకటనలు నమ్మే దశలో లేరు. తెలంగాణ ప్రజలు ఈ మేధావుల విశ్లేషణలను దాటి ఎంతో ఎదిగి ఉన్నారు. గుండె ధైర్యంతో నిలబడుతున్నారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు పావులు కదిపేందుకే నిర్ణయించుకున్నాయి.
తెలంగాణ ఉద్యమాన్ని ఈ దశలో మరింత ముందుకు తీసుకుపోవటానికి బయట శత్రువుకంటే అంతర్గత మిత్రవైరుధ్యాలు ప్రమాదకరంగా ఉన్నాయి. దీన్ని తెలంగాణ ఉద్యమం స్పష్టంగా అధిగమించాలి. ఈ నేల వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతరవేస్తాం అని కాళోజీ చెప్పిన మాటను ఇంటిదొంగలే ఎక్కువగా వల్లెవేయటం మరింత విచారకరం. తెలంగాణ ప్రజలు గత పదేళ్లలో రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో పరిణితి సాధించారు. ఇంటిదొంగలు, బైట దొంగలను తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం స్పష్టంగా గుర్తించగలుగుతుంది.
ఈ మిత్ర వైరుధ్యాలను ఆసరా చేసుకుని పబ్బం గడుపుకోవాలనుకునే వారి ఆటలు ఎల్లకాలం చెల్లవని గుర్తించటం మంచిది. వైరుధ్యాలు ఏ ఉద్యమంలోనైనా సహజమే. కానీ ఈ మిత్ర వైరుధ్యాలను శత్రుపూరితంగా మారకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ మేధావులదే. ఈ మిత్ర వైరుధ్యాల మధ్య మంటను రగిల్చాలని చూసే శత్రువులను ఆ దరికి రాకుండా చేయటమే మేధావుల పాత్రగా మరాలి. అన్ని పార్టీల, ప్రజాసంఘాల, కులసంఘాల ఐక్యత ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలగుతాం. ఐక్యతతో కలిసుండి అంతర్గతంగా విమర్శ ఆత్మ విమర్శలను చూసుకుంటూ ముందుకు సాగాలి.
అలా ముందుకు సాగకపోతే అనుకున్న ఫలితాలు రావు. “పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లు” పెట్టాలని ముక్తకంఠంతో అందరూ డిమాండ్ చేస్తున్నారు. దీని అమలు కోసం చేస్తున్న ఒత్తిడి కంటే తెలంగాణ నేతలపై ఒకరికొకరు చేసుకుంటున్న బహిరంగ విమర్శలకు, నేతలపై వ్యక్తిగత ఆరోపణలకే ఎక్కువ సమయం కేటాయించటం ఉద్యమానికి ఇది కానరాని ఆటంకంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ బలాన్నిపెంచుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని పార్టీలు గందరగోళపరుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పలు ప్రజాసంఘాల మధ్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరించుకోవాలి. అదే సమయంలో శత్రువైరుధ్యాలను ఎదుర్కోవాలి. ఇంటిదొంగల సమస్యను పరిష్కరించుకోవాలి. ఆంధ్రావలసవాద పెట్టుబడిదారులు సృష్టిస్తున్న పలురకాల ఇబ్బందులను ఎదుర్కోవాలి. ప్రభుత్వం ఉద్యమంపై ప్రయోగిస్తున్న పాశవిక నిర్బంధాన్ని ఇదే సమయంలో తిప్పికొట్టాలి. అందుకే రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న రాజకీయపార్టీ వీటన్నింటినీ అర్థం చేసుకుని అవగాహనతో ముందుకు సాగాలి.
ఈ అంతర్గత వైరుధ్యాలు ఒక దశదాటి ఆ పార్టీపైననే చేసినప్పటికినీ ఓపికతో దాన్ని అర్థం చేసుకుని వైరుధ్యాల పరిష్కారానికి తన వంతు కృషిచేయాలి. తెలంగాణ రాజకీయ పార్టీనే ఈ పెద్దన్న పాత్రను పోషించాలి. పోరాడేశక్తులు తమ పోరు పంథాల్లో ఇంకోదారిలో ముందుకు తీసుకపోవాలి. ప్రజలు పోరుదారిలో దుముకుతారో, లేదా పార్లమెంట్‌లో బిల్లును అమలుజరపడానికి ఒత్తిడి రూపంలో ఉప్పొంగుతారో ప్రజలే తేల్చి చెబుతారు. అందువల్ల సుదీర్ఘమైన తెలంగాణ రాష్ట్రసాధన పోరాటంలో వైరుధ్యాలను అధిగమిస్తూ తెలంగాణ ఎలా తనకుతాను ముందుకు సాగాలో సమర్థవంతంగా వ్యూహరచన చేసుకుంటుంది.

No comments: